బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం కవితను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత నివాసం వద్దకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కవితను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్… ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది.
సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకూం జారీ చేశాని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు.
కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు.
”చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోంది. రాజకీయంగా కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను బలి చేయడానికి నరేంద్రమోడీకంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇదో విఫలప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ నేతలు ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. దీనిపై ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటాం. చట్ట పరంగా న్యాయస్థానాల్లో పోరాడుతాం. ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది” అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌నేత ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.