బాలీవుడ్ హీరో, హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (తెలుగులో బ్రహ్మాస్త్రం). నిన్న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించారు. ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేయడం వల్ల విడుదలకు ముందే చిత్రంపై క్రేజ్ పెరిగింది.
కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే ఈ చిత్రానికి 20 కోట్ల వసూళ్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఇందులో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కోటిపైనే ఉండటం గమనార్హం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల అంచనా ప్రకారం తొలి రోజు ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ. 36 కోట్ల వసూళ్లు రాబట్టింది. సెలవు కాని రోజున విడుదలైన హిందీ ఒరిజినల్ చిత్రానికి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇదే అత్యధికం కావడం విశేషం. దాంతో, విడుదలతోనే ‘బ్రహ్మాస్త్ర’ కొత్త రికార్డును సృష్టించింది.
అమెరికాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తొలి రోజు యూఎస్ ఏ బాక్సిఫీస్ వద్ద ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లు (రూ. ఏడు కోట్లపైనే) సంపాదించినట్టు అంచనా వేస్తున్నారు. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో..అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించిగా.. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు.