కడుపుబ్బా నవ్వించే పాత్రల్లో మెప్పించిన బ్రహ్మానందం.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే పాత్రలో నటించనున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘రంగమార్తాండ’. అభిషేక్ జవ్కర్, మధు కలిపు నిర్మాతలు. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ నటించనున్నారు. ఇళయరాజా స్వరాలు అందించనున్నారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు.
‘మన ‘రంగమార్తాండ’ చిత్రంలో లెజండరీ, పద్మశ్రీ బ్రహ్మానందం గారు నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది . ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే పాత్రలో ఆయన కనిపించనున్నారు.’ అని కృష్ణవంశీ పేర్కొన్నారు. మరాఠీలో విజయవంతమైన ‘నటసామ్రాట్’ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. నటన నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాదకర జీవితమే ఈ చిత్రం. మరాఠీలో తెరకెక్కిన ఈ చిత్రంలో నానాపటేకర్ కీలకపాత్రలో కనిపించారు.