ఎమోషన్స్ కు, యాక్షన్ కు పెద్ద పీట వేసే బోయపాటి చాలా కాలం తరువాత ఓ ప్రేమకథను తెరకెక్కించాడు. అదే ‘జయ జానకి నాయక’. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంధర్భంగా బోయపాటి శ్రీనుతో
కాసిన్ని కబుర్లు..
సినిమా ఎలా ఉండబోతుంది..?
సినిమాకు వచ్చే ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాలను టచ్ చేస్తుంది.
రెండు సినిమాలు పోటీగా దిగుతున్నాయి. టెన్షన్ లేదా..?
మంచి సినిమాలు ఎన్ని వచ్చినా ప్రేక్షకులు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకేసారి మూడు సినిమాలు వస్తున్నాయంటే.. ఆడియన్స్ కు ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఒకేసారి మూడు సినిమాల విడుదల కారణంగా బహుశా థియేటర్ల కొరత ఏర్పడుతుందేమో..
మాస్ సినిమాలు చేసే మీరు ఈసారి జోనర్ మార్చడానికి కారణం..?
నిజానికి ఈ కథ నేను ఎప్పటినుండో చేయాలనుకుంటున్నాను. ‘భద్ర’ సినిమా తరువాత అలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ కథ, యాక్షన్ ఉన్న సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది.
కథలో ఏమైనా మార్పులు చేశారా..?
సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను మార్చాను. నా స్టయిల్ లో ఉండే ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలను జోడించాను.
సరైనోడు సినిమా తరువాత శ్రీనివాస్ తో చేయడానికి కారణం..?
నిజానికి సరైనోడు సినిమా తరువాత నాకు పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ నేను గతంలో శ్రీనివాస్ తో సినిమా చేస్తానని మాటిచ్చాను. అందుకే తనతో సినిమా చేశాను. అలా అని ఏదో చేయాలని కాకుండా నేను చేసిన సినిమాల కంటే ఎక్కువ స్థాయిలో ఉండేలా ప్రయత్నించాను.
హెవీ ప్యాడింగ్ అవసరమా..?
ఈ కథ మూడు కుటుంబాల మధ్య జరుగుతుంది. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే సీనియర్ నటీనటులను రంగంలోకి దించాం.
దేవిశ్రీప్రసాద్ తో గొడవ ఎలా సద్దుమణిగింది..?
ఇద్దరు టెక్నీషియన్స్ మధ్య అలాంటివి జరుగుతుంటాయి. అయినా ఆ విషయం అప్పుడే మర్చిపోయాం. తనతో కలిసి నేను చేస్తోన్న నాలుగో సినిమా ఇది. మా జర్నీ ఎప్పటికీ బాగానే ఉంటుంది.
ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ పెద్ద హీరో అవుతాడని అంటున్నారు. మీరేం అంటారు..?
నిజంగానే తను పెద్ద హీరో అయితే మంచి విషయమే కదా.. స్టార్ కావడానికి తనలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశాడు. ఈ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులూ ప్రేమిస్తారు.
తదుపరి చిత్రాలు..?
చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, అఖిల్ ల కోసం కథలు సిద్ధం చేసి పెట్టాను. వచ్చే ఏడాది మే నెలలో బాలయ్యతో సినిమా మొదలవుతుంది. ఈలోగా మరో సినిమా చేస్తానా..? లేదనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.