మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నోటీసులు పంపించారు. ప్రియా వారియర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ “శ్రీదేవి బంగ్లా”. ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అయితే ఈ ట్రైలర్, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది అలనాటి తార శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అదీకాకుండా శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సన్నివేశాన్ని చూపించడం, సినిమాలో ప్రియ.. శ్రీదేవి అనే టాప్ హీరోయిన్ పాత్రలో నటించడంతో సందేహాలు మరింత బలపడుతున్నాయి.
ఈ మేరకు ప్రియా వారియర్‌తో పాటు చిత్రబృందానికి బోనీకపూర్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి మీడియా ద్వారా వెల్లడించారు. “గత వారం బోనీ కపూర్ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మేం దీనిని ఎదుర్కొంటాం. నాది సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీకి నచ్చజెప్పాను. నా సినిమాలో కథానాయిక పాత్ర పేరు శ్రీదేవి. ఏదేమైనా కేసును మేం ధైర్యంగా ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు. మరోపక్క ఈ విషయం గురించి ప్రియావారియర్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. “ఇది శ్రీదేవి సినిమానా కాదా అని తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్ పాత్రలో నటిస్తున్నాను” అంటూ అసలు విషయం చెప్పకుండా మాటదాటేశారు.