Tirupati Bomb Threats:
గురువారం తిరుపతి నగరంలోని పలు హోటళ్లకు, ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. లీలా మహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లకు, రామానుజన్ జంక్షన్ వద్ద ఉన్న మరో హోటల్‌కు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి.
ఈ బెదిరింపుల్లో తమిళనాడు రాష్ట్రంలో జాఫర్ సాదిక్ అనే ఉగ్రవాది కేసు సంబంధం ఉందని, అందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరపాలని బెదిరింపు సందేశం యొక్క సారాంశం. ఇది ఐఎస్ఐ అనుసంధానం ఉన్నట్లు పేర్కొంది. బెదిరింపు సందేశంలో తమిళనాడు పాఠశాలలు, తిరుపతి మతపరమైన ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరుగుతాయని హెచ్చరించింది.
ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై, ప్రత్యేక బృందాలతో హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో అనుమానాస్పద ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగింది. అయితే, తుది పరిశీలనలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. కానీ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో, తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్‌లైన్స్ ఎస్5-154 ఫ్లైట్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు ట్విట్టర్ (X) ఖాతా “Adamlanja 333” ద్వారా వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అప్రమత్తమై, అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.
ఇటీవల కాలంలో భారతీయ విమానయానంపై బాంబు బెదిరింపులు విపరీతంగా పెరిగాయి. ఇండిగో, విస్తారా, ఆకాశా ఎయిర్ వంటి అనేక ఎయిర్‌లైన్స్ కు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో, విస్తారా ఢిల్లీ-హైదరాబాద్ విమానాన్ని కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా మార్గం మళ్లించారు.
తిరుపతి హోటళ్లు, విమానాశ్రయానికి వచ్చిన ఈ బెదిరింపులపై పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెదిరింపుల మూలాన్ని తెలుసుకునేందుకు పోలీసు బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తిరుపతి, తమిళనాడు ప్రజలు సురక్షితంగా ఉండాలని, అలాగే భయపడవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Read More: Bachchan కుటుంబం భారీ పెట్టుబడులు.. ముంబై లో ఏకంగా రూ. 200 కోట్లు!