‘రామాయణ్’ సీరియల్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్ర శేఖర్ (98) మరణించారు. దర్శకుడిగా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన వయోభారంతో స్వగృహంలోనే బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ‘‘నాన్నగారు నిద్రలోనే కన్నుమూశారు. ఆయనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వయసు మీద పడటంతోనే చనిపోయారు’’ అని చంద్ర శేఖర్ కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ అన్నారు. జుహులోని పవన్ హాన్స్‌లో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
1923లో హైదరాబాద్‌లో జన్మించిన చంద్రశేఖర్ నటనపై ఉన్న మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో హీరోగా ఏంట్రీ ఇచ్చారు. 250కి పైగా సినిమాలలో ఆయన నటించారు. 1964లో సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి, డైరెక్టర్ గా కూడా మారారు. హెలెన్ తొలిసారి లీడ్ రోల్ పోషించిన ‘చా చా చా’ సినిమాను ఆయనే నిర్మించారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌తో (డీడీ ఛానల్) విశేష ప్రేక్షకాదరణ పొందారాయన. ఇందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. చంద్రశేఖర్ కు ముగ్గురు సంతానం ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.