అనారోగ్యం కారణంగా ఈ ఏడాది కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి తాను హాజరు కాలేకపోయానని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. నవంబరు 8న ప్రారంభమైన 25వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 15న ముగిసింది. ఈ వేడుక ముగింపు కార్యక్రమంలో అమితాబ్ వీడియోను ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో బిగ్‌బీ క్షమించమని కోరారు. ‘నాకు ఎంతో ఇష్టమైన నగరం కోల్‌కతాలో జరగనున్న చిత్రోత్సవానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నన్ను ఆహ్వానించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో వేడుకకు రాలేకపోయాను. కానీ నేను చెప్పాలనుకున్న స్పీచ్ సిద్ధం చేసుకున్నా. ఇది మీరు చూసి నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నా. మరోసారి కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మమతాజీ. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకొంటున్నందుకు శుభాకాంక్షలు’ అని తెలిపారు.
అనంతరం చిత్ర పరిశ్రమ గురించి అమితాబ్ మాట్లాడుతూ.. ‘ఇవాళ భారత చిత్ర పరిశ్రమ కోసం మనమంతా కష్టపడుతున్నాం. కంటెంట్‌ను ఇంటి నుంచే చూసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కానీ సినిమాను వెండితెరపై చూడటంలో వచ్చే థ్రిల్ వేరు. దానికి ఏవీ సాటిరావు. ఈ సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. సినిమాల్ని ముందు థియేటర్‌లో విడుదల చేయాలి. ఆపై మిగిలిన మాధ్యమాల్లో ప్రసారం కావాలి. నేటి తరం అభిరుచులు మారాయి. దానికి తగ్గట్టే మా సినిమాలు కూడా వస్తాయి’ అని చెప్పారు. కోల్‌కతా చలన చిత్ర ఆరంభోత్సవానికి షారుక్ ఖాన్, సౌరభ్ గంగూలీ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.