బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే (77) ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కొన్ని గంటలపాటు బాలగంధర్వ్ రంగమంచ్‌లో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పుణెలోని వైకుంఠ సంశన్ భూమిలో అయనకు అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. అంతకుముందు గురువారమే ఆయన మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. పలువురు ట్విటర్‌లో సంతాపం కూడా తెలిపారు.
దాంతో విక్రమ్ గోఖలే కుమార్తె, ఆస్పత్రి వైద్యులు మీడియా ముందుకు వచ్చి ఆయన బతికే ఉన్నారని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన మరణించారు. గోఖలే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పలు మరాఠీ, బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 1990లో అమితాబ్ హీరోగా వచ్చిన అగ్నిపథ్, 1999లో సల్మాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ జంటగా నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్ తదితర సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.