బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్ సింగ్. ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సుశాంత్ సింగ్ తొలుత టెలివిజన్ నటుడిగా కెరీర్‌ను ఆరంభించారు. ఆ తర్వాత 2013లో బాలీవుడ్ చిత్రం ‘కై పో చీ’తో వెండితెరకు పరిచయమైన సుశాంత్ వరుస చిత్రాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బైకేశ్ బక్షి’ తదితర చిత్రాల్లో నటించాడు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సుశాంత్ ‘రాబ్తా’, ‘వెల్‌కమ్ న్యూయార్క్’, ‘కేదార్‌నాథ్’, ‘సంచీరియా’, ‘చిచ్చోరే’, ‘డ్రైవ్’ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘దిల్ బెచరా’ చిత్రీకరణ దశలో ఉంది.