గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కాలుష్యం కారణంగా షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆమె ‘ది వైట్ టైగర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత అరవింద్ అడిగా రచించిన ‘ది వైట్ టైగర్’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక.. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మాస్క్, కళ్లద్దాలు ధరించి సెట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కాలుష్యం కారణంగా షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇక్కడ నివసిస్తున్నవారి పరిస్థితి తలచుకుంటే చాలా భయంగా ఉంది. కాలుష్య కోరల నుంచి కాపాడుకోవడానికి మనకి మనకి మాస్క్‌లు ఉన్నాయి. కానీ ఇల్లు లేని నిరాశ్రయులు అష్టకష్టాలు పడుతూ రోడ్ల మీద నివసిస్తూ…ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రార్థించండి’ అని ప్రియాంక పేర్కొన్నారు.
ఇక ‘ది వైట్ టైగర్’ సినిమా నవలా ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. 2008లో అరవింద్ అడిగా రచించిన ‘ది వైట్ టైగర్’ నవల అదే సంవత్సరంలో బుకర్ ప్రైజ్‌ని సొంతం చేసుకుంది. ఓ గ్రామంలో టీ కొట్టులో పనిచేసే వ్యక్తి…సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎలా ఎదిగాడు అన్న నేపథ్యంలో రచించిన కథ ఇది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రియాంకతో పాటు ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు.