గోదావరిలో పర్యాటకులు ప్రయాణించే లాంచి మునిగిపోయింది. దేవీపట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్యన గోదావరిలో ఈ ఘటన జరిగింది. 62 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళ్తున్న పున్నమి లాంచి మునిగింది. ఇది గండి పోచమ్మ ఆలయం నుంచి బయల్దేరినట్టు తెలుస్తోంది. ఈ బోటులో 61 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 50 మంది పర్యాటకులు కాగా 11 మంది సిబ్బందిగా తెలుస్తోంది. వీరంతా గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లైఫ్ జాకెట్లు వేసుకున్న వారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
లైఫ్‌జాకెట్లు వేసిన వారిని స్థానికులు పడవల్లో వెళ్లి వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. ఈరోజు వరద ప్రవాహం తగ్గడంతో బోటుకు అనుమతి ఇచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చర్యలు చేపట్టారు. బోటు మునక ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడిన సీఎం జగన్. సహయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు సమాచారం. జిల్లా మంత్రులను హటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా కూడా సీఎం ఆదేశించారని సమాచారం.