దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తెలంగాణ వీరుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో తెరకెక్కుతుంది. తాజాగా విడుదలై ఈ సినిమా టీజర్ వివాదం రేపుతోంది. కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని విడుదల చేస్తూ టీజర్‌ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు.
తాజాగా దర్శకుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలి, ఒకవేళ అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉందని అయన అన్నారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని ఆయన అన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీమ్‌ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని అన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్ర ను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాద ఉండదని ఆయన హెచ్చరించారు.