ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఐటం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. దేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవిశ్రీప్రసాద్ హిందూవులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆయన బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు.
ఐటం సాంగ్స్‌ను దేవిశ్రీప్రసాద్ భక్తి గీతాలతో పోల్చడం పట్ల హిందూవులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. దేవిశ్రీప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొట్టి తరిమికొడతారని హెచ్చరించారు. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్‌లో కొన్ని పదాలను దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని రాజాసింగ్ అన్నారు. కాగా ఇటీవల పుష్ప సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ‘రింగ రింగా’, ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ ఈ రెండు పాటలను భక్తి పాటలుగా మార్చి పాడాడు. అంతటితో ఆగని ఆయన.. ఐటెం సాంగ్స్, దేవుళ్ల పాటలు తన దృష్టిలో ఒక్కటే అని చెప్పాడు. దీంతో దేవిశ్రీప్రసాద్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.