బిగ్‌బాస్ (హిందీ) 13 వ సీజన్ మూసివేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ టీవీ షోను వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ఒక లేఖ రాశారు.
బిగ్ బాస్-13 ప్రైమ్ టైమ్ స్లాట్‌లో ప్రసారం అవుతోందని, ఇందులో కంటెంట్ అసభ్యంగా, అసహ్యంగా ఉందని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే లేఖ రాశారు. బిగ్‌బాస్ షో ద్వారా అసభ్యత కూడా విపరీతంగా ప్రచారం జరుగుతోందని , సమాజంలో నైతిక విలువలను పతనం చేస్తోందని ఆయన విమర్శించారు. అందుకే ఈ షోను ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దేశీయ వాతావరణంలో ఈ ప్రదర్శనను చూడటం కష్టం. అలాగే నేరుగా టీవీ ద్వారా జనాలకు చేరుతున్న ఇలాంటి షోలు, సీరియల్స్ నియంత్రణకోసం చలన చిత్రాల మాదిరిగానే ఒక సెన్సార్‌బోర్డును ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
మరోవైపు బిగ్‌బాస్ షోను వ్యతిరేకిస్తున్నవారి వరుసలో రాజ్‌పుత్ కర్ణిసేన చేరింది. మణికర్ణిక, ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పద్మావత్, ఆర్టికల్ 15 వంటి చిత్రాలను నిషేధించాలంటూ ఆందోళనకు దిగిన కర్ణిసేన తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్-13 ని నిషేధించాలని పిలుపునిచ్చింది. బిగ్‌బాస్ రియాలిటీ షో భారతీయ సంస్కృతికి విరుద్ధమని, యువత దీన్ని చూడటం మంచిది కాదని పేర్కొంటూ దీన్ని నిషేధించాలని బుధవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు సేన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసింది. హిందూ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు హిందూ సంస్కృతిని దెబ్బతీస్తూ, లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ ఈ షో వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని సేన డిమాండ్ చేసింది.
అంతకుముందు బీజేపీ నాయకుడు సత్యదేవ్ పచౌరి కూడా బిగ్‌బాస్ -13 పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక్కఎపిసోడ్ కూడా చూడకపోయినా, ఈ షో ప్రసారాలపై సమాచారం తన దగ్గర ఉందని, సమాజంలో అశ్లీలతను వ్యాప్తి చేస్తున్న ఇలాంటి షోలను నిషేధించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.