తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతిచెందారు. దేశ ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది ఊపిరాడక
చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుల్లో 34 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. 44 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదు మృతదేహాలు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బస్సు లోయలో పడిన తర్వాత ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడడంతో ఉక్కిరిబిక్కిరి అయి ఊపిరి ఆడకే ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రాష్ట్రపతి, ప్రధాని సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ కవితతోపాటు వెళ్లి కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుంటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, ఆర్టీసీ తరపున రూ. 3 లక్షలు పరిహారం అందజేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఇవాళ జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యున్ని చేస్తూ జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బస్సు ఓవర్‌లోడ్‌లో ఉన్నందునే ప్రమాదం జరిగినట్టు భావించి డీఎంను సస్పెండ్ చేసినట్టు మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.