తెలుగు బిగ్ బాస్-2 రియాల్టీ షో మరి కొద్ది గంటలో ముగియనుంది. విజేత ఎవరో ఈ సాయంత్రమే తేలనుంది. 112 రోజులకుపైగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ షో చివరి దశలో మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ సభ్యుల మధ్య వివాదాలతో బిగ్ బాస్ సీజన్-2 ప్రజాదరణ పొందింది. ఈ సీజన్లో కౌశల్ విజేతగా నిలవడం ఖాయమని కౌశల్ ఆర్మీ ధీమా వ్యక్తం చేస్తుంది. గీతా మాధురి, దీప్తి పోటీ ఇచ్చినా.. కౌశల్‌కు భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. అయితే సీజన్-1లో శివ బాలాజీ టైటిల్ గెలిచాడు. ఆదర్శ్ గట్టిపోటీనిచ్చాడు. ఈ సీజన్లో మాత్రం ప్రేక్షకులు ఏకపక్షంగా కౌశల్‌కే ఓటేశారట.
ఇండియాలో ఇప్పటి వరకూ బిగ్ బాస్ షోల్లో ఎవరికీ రానన్ని ఓట్లు కౌశల్‌కు వచ్చాయట. తుది పోరులో నిలిచిన కంటెస్టంట్లకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు అతడి ఖాతాలోనే పడ్డాయని తెలుస్తోంది. టోటల్‌గా 27 కోట్ల ఓట్లు వస్తే.. 12.5 కోట్లకుపైగా ఓట్లు కౌశల్‌కే వచ్చాయని తెలుస్తోంది. కౌశల్‌కు ఏకంగా 39 కోట్ల 98 లక్షల 50 వేల ఓట్లు వచ్చాయంటూ.. మరో ప్రచారం జరుగుతోంది. మొత్తం పోలైన ఓట్లలో ఇది 78.9 శాతమట. రన్నరప్‌గా నిలిచిన గీతా మాధురికి 11 శాతం ఓట్లు దక్కాయంటూ ప్రచారం. బిగ్ బాస్ హౌస్‌లో కౌశల్ ఆటతీరుతోపాటు.. బయట కౌశల్ ఆర్మీ ప్రచారం అతడికి బాగా కలిసొచ్చింది. కౌశల్‌కు మద్దతుగా 2కే వాక్‌లు నిర్వహించారు. ఓట్ల విషయంలో జరుగుతోన్న ప్రచారం నిజమో కాదో తెలుసుకోవడానికి కౌశల్ ఫ్యాన్స్‌తోపాటు బిగ్ బాస్ వీక్షించే ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.