కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి జయశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుంది. డిప్రెషన్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని సన్నిహితులు భావిస్తున్నారు. గతేడాది జులై 22న ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా అభిమానులకు వెల్లడించింది. దీంతో అభిమానులు ఆందోళన చెందగా వెంటనే ఆమె సదరు పోస్టును తొలగించింది. బాగానే ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని తన మానసిక స్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో హీరో కిచ్చా సుదీప్ ఆమెకు ధైర్యం చెప్పినట్లు కూడా వార్తలు వినిపించాయి.
కానీ మళ్లీ ఐదు రోజులకే అంటే జూలై 25న అభిమానులతో లైవ్‌లో ముచ్చటించిన జయశ్రీ తన మనసులో ఉన్న బాధనంతా కక్కేసింది. “నేనిదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదు. సుదీప్ సర్ నుంచి ఆర్థిక సాయం కోరట్లేదు. నా చావును మాత్రమే కోరుకుంటున్నాను. డిపప్రెషన్‌తో పోరాడలేకపోతున్నా. ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను కానీ మానసిక ఒత్తిడితోనే చచ్చిపోతున్నా. ఎన్నో వ్యక్తిగత సమస్యలు నన్ను చీల్చి చెండాడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఈ సమస్యల ఊబిలో చిక్కుకున్న నేను వాటిని అధిగమించలేకపోతున్నాను” అని పేర్కొంది. ఈ మధ్య కాలంలో కూడా ఆమె తన మానసిక పరిస్థితి గురించి చెప్తూ ఓడిపోయానని, చనిపోవాలని ఉందని పేర్కొంది.