బిగ్‌బాస్-4 తెలుగు 33 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ షోపై వీక్షకులకు ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా జబర్దస్త్ నటుడు అవినాష్ హౌస్‌లోకి ఎంటరైనప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఇంటిలోని సభ్యుల్లో కాస్త ఎంటర్‌టైన్ చేసేది అవినాష్ మాత్రమే అన్నట్టుంది. 34వ ఎపిసోడ్ (అక్టోబర్ 9) హైలైట్స్ చూస్తే.. టాస్‌లో గెలిచి కొత్త కెప్టెన్ అయిన సోహైల్ హౌస్‌లో తన పనిని ప్రారంభించాడు.
ఇంటి సభ్యులు వారికి గతంలో జరిగిన సంఘటనల గురించి వివరించారు. ముందుగా నోయల్ తన తల్లి గురించి చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు. నేను ఇక్కడ ఉన్నానంటే మా అమ్మే కారణం అన్నాడు. ఆ తర్వాత తన తల్లిని గురించి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది లాస్య. తాను తల్లయ్యాక తన తల్లి విలువ తెలిసొచ్చిందని చెప్పింది. ఆతర్వాత అవినాష్ మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కొత్త ఇల్లు కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలిపాడు. అయితే అదే సమయంలో తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ కోసం రూ. 13 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని.. నెల నెలా ఈఎంఐలు కట్టలేక చనిపోవాలనిపించిందని.. అయితే తన తల్లిదండ్రుల కోసం ఖర్చు చేయడం సంతృప్తినిచ్చిందని అన్నాడు. నేను అప్పులు చేసినా అమ్మానాన్నల కోసమే.. వాళ్లు బాగుండాలి.. వారు బతికుండగానే చూసుకోవాలి.. దయచేసి ఎవరూ తన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పెట్టొద్దని విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులను గౌరవించండి.. వారు లేనప్పుడు బాధపడేకంటే ఉన్నప్పుడు బాగా చూసుకోవడం మంచిదంటూ అవినాష్ భావోద్వేగానికి గురయ్యాడు.
గంగవ్వ కూడా తన కష్టాన్ని చెప్పుకుంది. 5 ఏళ్లకే తనకు పెళ్లి చేశారని, 17 ఏళ్లకు కొడుకు పుట్టాడని, ఆ తర్వాత రెండేళ్లకు కూతురు పుట్టిందని చెప్పింది. భర్త తాగుడుకు బానిసై ఎప్పుడూ కొట్టేవాడని చెప్పింది. డబ్బు సంపాదించుకు వస్తాను అని విదేశాలకు వెళ్లాడు అని. ఓ రోజు నా కూతురుకు ఫిట్స్ రావడంతో ఆమెను ఎత్తుకుని నడక ప్రారంభించాను అని, అప్పుడు ఊర్లోకి బస్సు వచ్చేది కాదు. కానీ ఊరి నుంచి వెళ్లే ఓ బండి నన్ను చూసి ఎక్కించుకుంది. అలా జగిత్యాల ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ఆమె చనిపోయిందని చెప్పగానే బిడ్డను ఎత్తుకుని వెనుదిరిగాను. బస్ ఎక్కబోతే శవంతోని లోపలకు రానీయలేదు. ఆటోలో ఇంటికి వెళ్లాను” అని ఏడ్చేసింది. తర్వాత మళ్లీ అన్నం తినలేకపోతున్నానని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ తరువాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంలో అఖిల్, మెహబూబ్ పోటాపోటీగా ఆడారు. తర్వాత గెలిచిన మెహబూబ్‌కు మోనాల్‌తో హెడ్ మసాజ్ చేసింది. బిగ్‌బాస్ ఈసారి ఓ క్రేజీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ను ప్రసన్నం చేసుకోవాలని, అతని ఆత్మను రప్పించాలని చెప్పాడు. ఆ ఆత్మ అవినాష్ శరీరంలోకి వస్తుందని తెలిపాడు. వెంటనే ఇంటి సభ్యులందరూ బిగ్‌బాస్ ఆవాహయామి అంటూ చేతులు పట్టుకుని వలయాకారంలో అవినాష్ చుట్టూ తిరిగారు. వెంటనే ఉరుములు, మెరుపులతో బిగ్‌బాస్ ఆత్మ అవినాష్ శరీరంలోకి వచ్చింది. అతడు ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి వివరంగా చెప్పాడు. ఈ టాస్క్ ఫన్నీగా అనిపించింది. ఇక ఈ రోజు శనివారంలో ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి.