బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పదిహేను ఎపిసోడ్‌లను ముగించుకుని నేడు పదహారో ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. తొలివారం హేమ.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ కావడంతో ఇక మూడో వారం నామినేషన్‌పై హౌస్‌మేట్స్‌లో టెన్షన్ మొదలైంది. సోమవారం ఎలిమినేషన్‌కి నామినేషన్ ఉండటంతో ఎవర్ని నామినేట్ చేయాలన్న వ్యూహాల్లో ఎవరికి వారే ప్లాన్‌లు వేసుకున్నారు. మహేష్, బాబా భాస్కర్, వితికా, పునర్నవి, శ్రీముఖిలు నామినేషన్స్‌పై చర్చలు కూడా జరిపారు. ఈ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంతవరకు నామినేషన్ ప్రక్రియను కన్ఫెషన్ రూంలో గుట్టుగా జరిపించే బిగ్‌బాస్.. మొదటిసారిగా అందరి ముందు ఓపెన్‌గా పెట్టారు. తమకు ఇష్టం లేని ఇద్దరిని నామినేట్ చేయవచ్చని ఇందుకోసం ఎర్రటి రబ్బరు స్టాంప్ ఇచ్చారు. ఎవరినైతే నామినేట్ చేయదల్చుకున్నారో ఆ కంటెస్టెంట్ నుదురు మీద తప్ప..
మిగతా చోట్ల స్టాంప్ వేసి.. నామినేట్ చేయడానికి గల కారణాలను వివరించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
ఏం కారణాలు చెప్పి నామినేట్ చేయాలో తెలియక హౌస్‌మేట్స్ అందరూ ఆలోచనలో పడ్డారు. కొందరైతే సిల్లీ కారణాలు చెప్పి నామినేట్ చేశారు. మరికొందరు తమను నామినేట్ చేసినందుకే తిరిగి నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. తనను నామినేట్ చేసేందుకు చెప్పిన కారణాలతో విసిగిపోయిన పునర్నవి హౌస్‌లో శివతాండవం చేసింది. తనకు తాను నామినేట్ చేసుకుంటున్నట్లు ప్రకటించి స్టాంప్ వేసుకుని బిగ్‌బాస్ మాటను కూడా ధిక్కరించింది. తనను మొదటి వారం నుంచి కార్నర్‌చేశారని.. తాను అందరితో కలిసిపోయేందుకు ప్రయత్నించినా.. అవే కారణాలతో నామినేట్ చేస్తున్నారని పునర్నవి ఫైర్ అయింది. తనకు హౌస్‌లో ఉండాలనిపించట్లేదని తనకు తాను నామినేట్ చేసుకున్నట్లు తెలిపింది. బిగ్‌బాస్ నియమాల ప్రకారం ఎవరికి వారు నామినేట్ చేసుకోవడం కుదరదు. చివరకు వరుణ్ సందేశ్ మాటలతో వెనక్కి తగ్గి.. బాబా భాస్కర్,
శివజ్యోతిని నామినేట్ చేసింది. హౌస్‌లో బాబా భాస్కర్ అందరికీ హీరో కావొచ్చు.. కానీ తనకు కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.
నామినేషన్ ప్రక్రియలో తన బూతు పురాణంతో తమన్నా మళ్లీ రెచ్చిపోయింది. తమన్నా తనకు ఇచ్చిన ఫ్లోర్ క్లీనింగ్ పని చేయకుండా మొండికేయడంతో హౌస్ కెప్టెన్ వరుణ్‌కి మహేష్ కంప్లయింట్ చేశారు. ఆమె క్లీన్ చేస్తే నేను గుండు కొట్టించుకుంటా నంటూ శపథం కూడా చేశారు. దీంతో కెప్టెన్ వరుణ్ తమన్నా దగ్గరకు వెళ్లి మీరు ఎందుకు చేయడం లేదని.. అది మీ పని కదా అని ప్రశ్నించడంతో తమన్నా కోపంతో తిట్టుకుంటూ ఇంటిని క్లీన్ చేసింది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఎక్కువ మంది నామినేట్ చేసిన వారిలో తమన్నా-5, పునర్నవి-4, రాహుల్-4, వితికా-3, బాబా భాస్కర్-3 నిలిచారు. గత వారం ఎనిమిది మంది నామినేషన్‌లో ఉండగా ఈవారం ఐదుగురు నామినేట్ అయ్యారు.