బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్‌గా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం మసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో మంత్రి తలసానితో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనూహ్యరీతిలో రాహుల్ బిగ్‌బాస్ టైటిల్‌కు సొంతం చేసుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాతబస్తీ యాస, బాషతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశేషంగా ఆకట్టుకున్న సిప్లిగంజ్‌కు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనంతరం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపున పూర్తి సహయ సహకారాలు ఉంటాయని రాహుల్‌కి హామీ ఇచ్చారు. ఇక వంద రోజులకు పైగా ఉత్కంఠగా సాగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నర్‌గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా రాహుల్ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే.