తెలుగు బిగ్‌బాస్.. నాల్గో వారంలో.. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగకపోవడం.. కెప్టెన్సీ టాస్క్ సైతం తేలిపోవడం.. డ్రాగన్స్ చేజిక్కించున్న అలీరెజా, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌లు కూడా ఆకట్టుకోలేకపోయారు. సింహాసనంపై కూర్చున్న అలీరెజాను దింపడంలో హౌస్‌మేట్స్ వినూత్న ప్రయత్నాలేవీ చేయలేదు.
ఎంతసేపు అలీ మీద కూర్చోడం, సింహాసనం పక్కనే ఉండటం తప్ప చేసిందేమీ లేదు. ఒంటి చేత్తో రవికృష్ణ కాసేపు పోరాడగా.. పెద్ద పెద్ద మాటలు చెప్పిన రాహుల్.. కొద్దిసేపు మాత్రమే పోరాడి చేతులెత్తేశాడు. చివరకు అలీరెజా సులభంగా కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఈ టాస్క్‌లో కొద్దిలో కొద్దిగా వరుణ్ కొత్తగా ట్రై చేశాడు. నీళ్లు తెచ్చి సింహాసనానికి రక్షణగా ఉన్నవారిపై పోయడం లాంటివి చేశాడు. బక్రీద్, స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగ అంటూ హౌస్‌మేట్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయారు. ఈ వారం మొత్తంగా బిగ్‌బాస్ ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది.
అయితే కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే.. ఎలిమినేషన్ ప్రక్రియ. ఈ సారి ఎవరు ఎలిమినేట్ కానున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్‌బాస్ ఇంట్లోనూ ఈ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. శ్రీముఖి అనాలిసిస్ చేసి.. ఈవారం రోహిణి ఎలిమినేట్ కానుందని తేల్చిచెప్పింది. దీంతో కుంగిపోయిన రోహిణి కంటతడి పెట్టుకుంది. అయితే బయట కూడా ఇలాంటి అనాలిసిస్సే జరుగుతోంది. ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న వారందరిలో రాహుల్, శివజ్యోతి, రోహిణికి తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఓటింగ్ విషయంలో ఈ ముగ్గురు చాలా తక్కువ వ్యత్యాసంలో ఉన్నట్లు సమాచారం.
అయితే ముగ్గురికి సమాన ఓట్లు వస్తుండటంతో సోషల్ మీడియాలో ఓ క్యాంపైన్ కూడా నడిచింది. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాలి అనుకుంటే.. మిగతా ఇద్దరికీ సమాన ఓట్లు వేయండంటూ ప్రచారం జరిగింది. మరోవైపు ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్త కూడా వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ వారం ఏది జరిగినా అది పెద్ద సర్‌ప్రైజ్‌గానే ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఇంతవరకు ఎలాంటి నెగెటివిటీ లేకుండా నెట్టుకొట్టుస్తున్న రోహిణి.. హౌస్‌లో నిత్యం కంటతడి పెడుతూ పాతాళగంగగా పేరు తెచ్చుకున్న శివజ్యోతి.. పునర్నవి వ్యవహారంతో క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉండటం.. ఈ వీకెండ్‌ను మరింత ఆసక్తికరంగా మలచనుంది. చూడాలి మరి.. ఈ వారం బిగ్‌బాస్ ఇంటిని ఎవరు వీడనున్నారో?.