తెలుగు అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్- 3’ కి మరికొద్ది రోజుల్లో శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం పాలు పంచుకుంటున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్టు చేయాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇప్పటికే శ్రీముఖికి జబర్దస్త్ యాంకర్ రష్మీ, రాంప్రసాద్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ రవి కూడా తన బెస్ట్‌ప్రెండ్ అలీ రెజాకి మద్దతు తెలిపాడు. తన స్నేహితున్ని గెలిపించాలని కోరుతూ ఫేస్‌బుక్ లైవ్ నిర్వంచారు.
అయితే ఫేస్‌బుక్ లైవ్‌లో రవి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అందరూ తనకు ఇష్టమేనని, కానీ తన మద్దతును మాత్రం అలీరెజాకే ఇస్తానని చెప్పాడు. శ్రీముఖినీ కాదని అలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో కూడా వివరించారు. ‘అలీ రేజా నా కుటుంబ సభ్యుడులాంటి వాడు. ఇండస్ట్రీలో నా బెస్ట్‌ప్రెండ్ అతనే. మా ఇంట్లో పండుగైతే వాళ్లు వస్తారు.. వారింట్లో పండగైతే మేము వెళ్తాం. రంజాన్ పండగ రోజు బిర్యానీ పంపిస్తాడు. నాతో కలిసి దీపావళి పండుగ జరుకుంటాడు. మా మధ్య అంతమంచి సంబంధం ఉంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో అందరూ నాకు నచ్చివాళ్లే. కానీ అలీ నాకు సొంత అన్నలాంటివాడు. అందుకే అతనికి సపోర్ట్ చేస్తున్నా. గేమ్ బాగా ఆడుతున్నాడు. అలీ మొదటి నుంచి 49 వరకు ఏంటో మీకు తెలుసు. ఎలిమినేట్ అయినప్పుడు నాతో పాటు అందరు బాధపడ్డారు. అతను చాలా మంచోడు.. గేమ్ బాగా ఆడుతుంటే ఎందుకు ఎలిమినేట్ చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. బయటకు వచ్చాక కూడా అలీని కలిశా. పార్టీ చేసుకున్నాం. ఆ తర్వాత బిగ్‌బాస్ టీం వచ్చి రీఎంట్రీకి అడిగినప్పుడు ఆలోచించాడు.
అతనేం సొంతంగా వెళ్లలేదు. అతను ఉంటే బాగుంటుందని భావించే బిగ్‌బాస్ మేనేజ్‌మెంటే మళ్లీ ఆహ్వానించింది. అయితే రీఎంట్రీ తర్వాత అలీ అలాగే ఉన్నాడు. కానీ చూపించే విధానం మారింది. అది ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. వారికి నచ్చింది వారు చూపిస్తారు. దీంట్లో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. 24 గంటల్లో కేవలం ఒక గంట మాత్రమే వారిని చూపిస్తారు. ఇండస్ట్రీ వాళ్లం కాబట్టి మాకు అంతా తెలుసు. షూటింగ్, రేటింగ్, ఔట్ పుట్, మనీ ఇవన్నీ మాకు తెలుసు. మీరు చూసేవాళ్లు మాత్రమే. మేం ఏది చూపిస్తే అది చూస్తారు. మిమ్మల్ని నమ్మేలా చేసేది మేం. ఇది బిజినెస్. ఒక గంట చూసి ఒకరు మంచోడు ఒకరు చెడ్డోడు అని ఎలా డిసైడ్ అవుతారు. అది ఒక గేమ్.. అంతా చూపించరు. దయచేసి ట్రోలింగ్ చేయకండి. అలీ చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు. తెలుగు నేర్చుకున్నాడు. యాక్టింగ్ నేర్చుకున్నాడు. కష్టపడి సీరియల్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌లోకి వచ్చి కూడా జన్యూన్‌గా ఆడుతున్నాడు. గేమ్‌లోకి వేళ్లేముందు అలీకి ససోర్ట్ చేస్తానని మాట ఇచ్చా. అందకే సపోర్ట్ చేస్తున్నాను.
శ్రీముఖికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అందరూ ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి నా కోయాంకర్ మాత్రమే. మా మధ్య మంచి బాండ్ ఉంది. తను కూడా గేమ్ బాగా ఆడుతోంది. ఈ విషయాన్ని నేను బిగ్‌బాస్ షోకి వెళ్లినప్పుడు కూడా చెప్పాను. అయినా ట్రోల్ చేస్తున్నారు. అందరికి సపోర్ట్ చేయాలని ఉందా? శివజ్యోతికి బిత్తిరి సత్తి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుతారు. అలీ నా అన్న లాంటి వాడు అందుకే శ్రీముఖిని కాదని అతనికి సపోర్ట్ చేస్తున్నా. మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోండి కానీ ట్రోలింగ్ చేయకండి ప్లీజ్. హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరూ కలిసి ఉంటారు. మీకు గొడవలు ఎందుకు? ఇకనైనా ట్రోలింగ్ ఆపండి’ అని రవి కోరారు. అయితే ఫైనల్స్‌కు ఎవరు వెళ్తారని నెటిజన్ అడగ్గా.. రాహుల్, అలీలు టాప్ వన్, టూలో ఉంటారని అభిప్రాయపడ్డాడు. బిగ్‌బాస్ 3 విన్నర్ ఎవరో తనకు తెలుసని, అది మాత్రం ఇప్పుడు చెప్పనని రవి అన్నాడు.