తెలుగులో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ హౌస్-2 చివరి దశకు చేరుకుంది.ఈనేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్ సభ్యుల మధ్య చాలా పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. హౌస్‌లో కౌశల్ ఏకాకి అయిపోయాడు. దానికి కారణాలు ఏవైనాగానీ, షోలో ప్రతిరోజూ జరుగుతున్న గందరగోళం కౌశల్ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన సింపథీని క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కౌశల్ పేరు మార్మోగిపోతోంది. నిన్న దుబాయ్‌లో భారత్ – హాంగ్‌కాంగ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మైదానంలో కూడా ‘కౌశల్’ పేరుతో జెండా ఎగరేశారు. ఇలా ‘కౌశల్ ఆర్మీ’, కౌశల్ కోసం చాలా కష్టపడుతోంది.
ఇరవై నాలుగు గంటల్లో గట్టిగా గంటన్నర సమయం మాత్రమే షో ప్రసారమవుతోంది. ‘అవసరమైన కంటెంట్’ మాత్రమే తీసుకుంటూ, దానికి మసాలా జోడించి ప్రసారం చేస్తోంది ‘బిగ్ బాస్’ టీమ్. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కౌశల్, తనీష్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. ‘ఇలాగే భౌతిక దాడులు కొనసాగితే, కౌశల్, తనీష్‌లను హౌస్ నుంచి పంపించేయాల్సి వుంటుంది..’ అని బిగ్ బాస్ హెచ్చరించాడు.
కాగా నిన్న ‘కుక్కల్లా మీద పడిపోతున్నారు..’ అంటూ కౌశల్ సహనం కోల్పోవడాన్ని హైలైట్ చేస్తూ .. ఓ ప్రోమో చూపించాడు బిగ్‌బాస్. ఈ ప్రోమోని బట్టి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అని ఊహించవచ్చు. ఇప్పటికే కౌశల్ ఆర్మీ, బిగ్ బాస్ హోస్ట్ నానితోపాటు, బిగ్ బాస్ షో ప్రసారమవుతున్న ‘స్టార్ మా’ ఛానల్‌కి కూడా అల్టిమేటం ఇచ్చింది. బయట కౌశల్ ఆర్మీని చూసి సెలబ్రిటీలే ఖంగు తింటున్నారు. ఒకవేళ బిగ్‌బాస్ నుంచి కౌశల్ తనంతట తానుగా షో నుంచి బయటకు వచ్చినా (సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుంటే) ఇక బయట గందరగోళం జరుగుతోంది అనే మాట బలంగా వినిపిస్తున్నది.