సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయం ఆసన్నం అవుతోంది. కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. పార్టీ పేరు, చిహ్నం, జెండా విషయంగా సుదీర్ఘంగా సమాలోచన సాగునుంది. సైకిల్, పాల క్యాన్‌తో రజనీ స్టైల్‌ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. గురువారం పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరివి మణియన్ మక్కల్ మండ్రం జిల్లాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. గంటల తరబడి ఈ భేటీ సాగడంతో ప్రాధాన్యత పెరిగింది. పార్టీ పేరును అత్యంత రహ్యంగా ఉంచేందుకు నిర్ణయించినా, చిహ్నం, జెండా మాత్రం లీక్ అయ్యాయి. ప్రజల్ని ఆకర్షించే రీతిలో మూడు వర్ణాలతో రజనీ పార్టీ జెండా రూపుదిద్దుకోబోతోంది. ఆయా వర్ణాలతో జెండా రూపురేఖల నమూనా సిద్ధం చేసి, రజనీ వద్దకు తీసుకెళ్లేందుకు సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.
పార్టీ చిహ్నంగా సైకిల్‌ను ఎంచుకునేందుకు సిద్ధమైనట్టు చర్చ. సైకిల్ చిహ్నం విషయంగా ఏదేని అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చన్న భావనతో అందుకు కొన్ని మెరుగులుదిద్దారు. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో సైకిల్, పాల క్యాన్ గెటప్ అభిమానుల్ని అలరించింది. ప్రస్తుతం ఇదే ఆ పార్టీకి చిహ్నంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైకిల్, పాలక్యాన్‌తో రజనీ గెటప్ తరహాలో చిహ్నంపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. మక్కల్ మండ్రం నిర్వాహకులు జెండా, చిహ్నం విషయంగా తమ అంగీకారం తెలిపినా, తుది నిర్ణయం రజనీకాంత్ తీసుకోవాల్సి ఉందని ఆ మండ్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు.