తమిళ విలక్షణ నటుడు విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తమిళంలో పిచ్చైక్కరన్ పేరుతో 2016లో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగులో బిచ్చగాడు పేరుతో విడుదల చేశారు.
ఇక్కడ కూడా ఈ మూవీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి విజయ్ ఆంటోని ప్రకటించిన అప్పటి నుండి ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడమే కాకుండా ఈసినిమాకు దర్శకత్వం కూడా వహించారు. సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు.
దీంతో.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ క్రమంలోనే తాజాగా అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చింది మూవీ టీమ్ వేసవిలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ‘స్నీక్ పీక్ ట్రైలర్’ అంటూ సినిమా ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే.. మనిషి మెదడుపై రీసెర్చ్ చేసే కథాంశంతో రూపొందినట్లు తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్ హరీష్ పెరడి జాన్ విజయ్ రాధా రవి మన్సూర్ అలీ ఖాన్ వైజీ మహేంద్రన్ రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంథోనీ విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు.