‘మైనే ప్యార్ కియా’ అంటే.. భాగ్యశ్రీ పేరు సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో సల్మాన్ తో కలిసి ఆమె చేసిన సందడి కళ్లముందు కదలాడుతుంది. అలాంటి భాగ్యశ్రీ ఆ తరువాత అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపించింది. చాలా కాలం క్రితం ‘రాణా’ సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో మెప్పించిన ఆమె, ఆ తరువాత మళ్లీ కనిపించలేదు.
మళ్లీ ఇంతకాలానికి ఆమె ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ ‘జాన్’ టైటిల్ తో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని రూపొందిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత వుంటుందట. అందువల్ల ఆ పాత్రకి భాగ్యశ్రీని ఒప్పించినట్టుగా రాధాకృష్ణ చెప్పారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఆయన అన్నారు. ఒక షెడ్యూల్ నిమిత్తం ఈ సినిమా టీమ్ ఆస్ట్రియా వెళ్లనున్న సంగతి తెలిసిందే.