నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో తెలంగాణ యాసలో బాలకృష్ణ పలికే డైలాగులు హైలైట్. “ఎత్తిన చెయ్యి ఎవనిదో తెలియాలే, లేచిన నోరెవరిదో తెలియాలే, మిమ్మల్ని పంపిన కొడుకెవడో తెలియాలే…”, “ష్… సప్పుడు జెయ్యాక్” అంటూ బాలయ్య నోటి వెంట డైలాగులు పవర్ ఫుల్ గా వెలువడడం ట్రైలర్ లో చూడొచ్చు.
బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి. శ్రీలీల పాత్ర కథకు కీలకమని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. “బ్రో… ఐ డోంట్ కేర్” అంటూ బాలయ్య పలికే డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది. ఇందులో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బాలకృష్ణతో తలపడనున్నాడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.