టాలీవుడ్‌లో ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ సింహా. తొలిసినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. కీరవాణి తనయుడిగా కాకుండా తన మార్క్ చూపించాడు. ఆ తరువాత చేసిన రెండు సినిమాలు అంతగా వర్కవుట్ కాలేదు. తాజాగా ‘భాగ్ సాలే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..
అర్జున్ (శ్రీ సింహా) పెద్ద పెద్ద కలలతో బతికేస్తుంటాడు. తనది రాయల్ ఫ్యామిలీ అనుకుంటాడు. అలాంటి అబద్దాలు చెప్పి మాయ (నేహా సోలంకి)ని ప్రేమలో పడేస్తాడు. మాయ సైతం అర్జున్‌ను రిచ్ అనుకుని నమ్మేస్తుంటుంది. చాలా కాలం క్రితం ఒక రైతుకు వజ్రం దొరుకుతుంది .. అతను దానిని ఒక సేఠ్ కి అమ్ముతాడు. కోహినూర్ తో పాటు అత్యంత విలువైన ఐదు వజ్రాలతో అది ఒకటి, బ్రిటీష్ వారి కాలంలో అది వారి చేతుల్లోకి వెళుతుంది. అక్కడి నుంచి ఫ్రెంచ్ అధికారులు .. ఆ తరువాత నిజాం నవాబుల చేతికి మారుతుంది. ఆ వజ్రంలో ఒక భాగాన్ని ఉంగరంగా చేయించుకుని నవాబులు వాడటం జరిగింది. ఇప్పుడు ఆ ఉంగరం ఖరీదు 25 కోట్లు.
ఆ ఉంగరం మాయా తండ్రి దగ్గర ఉందని తెలిసిన శామ్యూల్, అతణ్ణి తన బంగ్లాలో బంధిస్తాడు. ఆ ఉంగరాన్ని శామ్యూల్ కు ఇచ్చేసి, తన తండ్రిని క్షేమంగా తీసుకురమ్మని అర్జున్ ను మాయా కోరుతుంది. ఆ డైమండ్ రింగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అది తీసుకురావడానికి అర్జున్ ఏం చేస్తాడు? విలన్ గ్యాంగ్ ద్వారా ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? తాను శ్రీమంతుడిని కాననే నిజాన్ని మాయాకి అర్జున్ చెబుతాడా? అనేవి కథలోని అంశాలు.
‘భాగ్ సాలే’ కథ, కథనాలు కొత్తగా ఏమీ ఉండవు. పాత కథే. క్రైమ్ కామెడీ జానర్ అన్నారు గానీ అంతగా క్రైమ్ లేదు అంతగా కామెడీ కూడా లేదు. వెబ్ సిరీసుల్లో డైరెక్టర్ ప్రణీత్ హిట్ అయ్యాడు. ‘సూర్యకాంతం’తో దర్శకుడిగా ప్రణీత్‌కు ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడు ట్రాక్ మార్చి కమర్షియల్, కామెడీ జానర్‌లో ‘భాగ్ సాలే’ను తీశాడు. కానీ ఇది కూడా అంతగా కలిసి వచ్చేలా లేదు. కొన్ని చోట్ల మాటలు, పంచ్ డైలాగ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. రైటింగ్ విషయంలో ప్రణీత్ ఫర్వాలేదనిపించాడు
ఈ సినిమా ‘స్వామి రారా’ టైపులో ఉంటుందని ప్రమోషన్స్‌లో డైరెక్టర్ ప్రణీత్ చెప్పాడు. కానీ అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కామెడీ కూడా ఇందులో కనిపించదు. ప్రథమార్ధం ఫర్వాలేదనిపిస్తే.. ద్వితీయార్ధం పూర్తిగా తేలిపోయింది. రాజీవ్ కనకాల, శ్రీసింహా కాంబో సీన్.. క్లైమాక్స్ ఫైట్ సీన్లో సత్య ఎంట్రీ మినహా మిగిలినదంతా దండగే అనిపిస్తుంది. సాంకేతికంగా చూస్తే విజువల్స్ సహజంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. కాళ భైరవ అందించిన పాటలు గుర్తుండటం కష్టమే. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి.
అర్జున్ పాత్రలో శ్రీ సింహా కొత్తగా కనిపించాడు. అబద్ధాలు చెప్పడం, పెద్దింటి కుర్రాడిగా నటించే సీన్లలో కామెడీని బాగానే పండించాడు. శ్రీ సింహా కామెడీ టైమింగ్ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. నేహా సోలంకి లుక్స్, నటన పరంగా మెప్పిస్తుంది. రాజీవ్ కనకాల పాత్ర కొత్తగా ఉంటుంది. శామ్యూల్‌గా విలన్ పాత్రలో జాన్ విజయ్ నవ్విస్తాడు. జాకీగా హర్ష చెముడు, కిట్టుగా సుదర్శన్, రమ్యగా వర్షిణి, నళినిగా నందినీ రాయ్ ఇలా అందరూ మెప్పించారు. ప్రామిస్ రెడ్డిగా పోలీస్ పాత్రలో సత్య నవ్వించాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
టైటిల్ :భాగ్ సాలే
నటీనటులు: శ్రీసింహా,నేహా సోలంకి,రాజీవ్ కనకాల,నందిని రాయ్,జాన్ విజయ్,హర్ష చెముడు
దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి
నిర్మాతలు: అర్జున్ దాస్యన్, కల్యాణ్ సింగనమల, యష్ రంగినేని
సంగీతం: కాళభైరవ
చివరగా.. రొటీన్ మూవీ