ప్రముఖ ఇండియన్ సింగర్ బప్పీ లహిరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15న దేశం సంగీత పరిశ్రమలోని మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ‘డిస్కో కింగ్’ గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పి లహిరి మంగళవారం రాత్రి పలు ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం అనేక దశాబ్దాలుగా తన గాత్రంతో లక్షలాది మందిని ఉర్రూతలూగించారు. సింగింగ్ లెజెండ్ బప్పీ లహిరి అంత్యక్రియలు ఫిబ్రవరి 17న ముంబైలోని విలే పార్లే శ్మశానవాటికలో జరిగాయి. ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు బప్పీ అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఆయన అంత్యక్రియలకు విద్యాబాలన్, మికా సింగ్, అల్కా యాగ్నిక్, ఇలా అరుణ్, శక్తి కపూర్, నిఖిల్ ద్వివేది, భూషణ్ కుమార్ తదితరులు హజరైయ్యారు. ఫిబ్రవరి 17న తెల్లవారుజామున 3 గంటలకు బప్పి కుమారుడు బప్పా లహిరి తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించడానికి తన కుటుంబంతో సహా లాస్ ఏంజెల్స్ నుండి తిరిగి వచ్చాడు. సమాచారం ప్రకారం బప్పీ లహిరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత నెలలో ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం డిశ్చార్జి కాగా, ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మళ్లీ ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి 11.45 గంటలకు అనారోగ్యంతో బప్పీ కన్నుమూశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా బప్పీ లహిరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుస ట్వీట్లతో అభిమానులు ఆయన సంగీతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.