పాకిస్థాన్‌లో దాదాపు దేశంలోని అన్ని బ్యాంకుల డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. సీనియర్ సైబర్ క్రైమ్ అధికారులను పేర్కొంటూ పాకిస్తాన్‌కు చెందిన జియో న్యూస్ వెల్లడించింది. దేశంలోని సుమారు పది బ్యాంకులు తమ కార్డులపై అంతర్జాతీయ లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో దేశంలో జారీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తమౌతోంది.పాకిస్థాన్‌కు చెందిన దాదాపు అన్ని బ్యాంకుల డేటా హ్యాక్ అయినట్లు తమకు ఇటీవల ఒక నివేదిక అందినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన సైడర్ క్రైమ్ విభాగం డైరెక్టర్ కెప్టెన్ మహ్మద్ షోయబ్ తెలిపారు. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.