టాలీవుడ్లో బండ్ల గణేశ్ నటుడిగానే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత నిర్మాతగా మారి, భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాడు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత నిర్మాతగా సినిమాలకి దూరమైన ఆయన, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో మళ్లీ నటుడిగా కనిపించాడు. ఆ తరువాత ఇకపై అలాంటి పాత్రలు చేయనని కూడా చెప్పాడు. కానీ ఇటీవల ఆయన నటన వైపు మొగ్గుచూపుతున్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో రూపొందిన ‘మండేలా’ తెలుగు రీమేక్‌లో బండ్ల గణేశ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇక ఇప్పుడు మళ్లీ అలాంటి టాక్ ఒకటి బలంగానే వినిపిస్తోంది. వెంకట్ అనే ఒక కొత్త దర్శకుడు ఒక కథను తయారుచేసుకున్నాడట. పూర్తి వినోదభరితంగా సాగే ఈ కథలో, ప్రధాన పాత్రను బండ్ల గణేశ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతన్నది చూడాలి మరి.