నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. ఈ చిత్రాన్ని జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. అయితే కార్తీక మాసం మొత్తం బాలకృష్ణ అభిమానులు 9 రాష్ట్రాలు, దాదాపు 16 వేల కిలోమీటర్లు 41 రోజులు, 100 గుళ్ళు, దర్గాలు, చర్చులు అన్నీ దర్శించుకొని కుంకుమార్చన జరిపించారు. ఆ కుంకుమను, నీటిని బాలకృష్ణకు అందించారు. ఈ సంధర్భంగా..
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ”భారతదేశ సహస్ర పుణ్యక్షేత్ర జైత్రయాత్ర ముగించుకొని కుంకుమార్చన సభకు మూలకారకుడు సాలెమ్మ పుత్ర అనంతపురం జగన్. అతడికి, అతడికి సహకరించిన నా అభిమానులకు ధన్యవాదాలు. శాతవాహన వంశంలో 23వ రాజు గౌతమీపుత్రుడు.
పౌరుష జ్ఞాన కీర్తులు కలిగి ఒక జన్మ బ్రతికితే చాలు జన్మ సార్ధకం అవుతుంది.. కేవలం పొట్ట నింపుకోవడం కోసమే బ్రతుకుతున్న కాకి ఎంతకాలం బ్రతికితే మాత్రం ఉపయోగం ఏముంటుంది.. అందుకే మన పెద్దలు కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా ఐదు నిమిషాలు బ్రతకడం చాలని అన్నారు. అలాంటి తెలుగుజాతి రాజహంస శాతకర్ణి.. పరులకు మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ప్రజలకు మేలు చేసేవాడికి ప్రపంచంలో ఎదురు ఉండదు. అదే విధంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శాతవాహన క్షీర సాగర సంజేయుడు, భారత జాతికి నూతన శకాన్ని ప్రసాదించిన శఖ పురుషుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ముక్కలు ముక్కలుగా ఉన్న అఖండ భారతదేశంలోని ఘన రాజ్యాల్ని ఏకం చేసి విదేశీయులు మళ్ళీ భారత జాతి వైపు అడుగుపెట్టకుండా వారిలో భయం సృష్టించిన సింహం శాతకర్ణి. చరిత్రలో చాలా తక్కువమంది రాజశీయాగం చేశారు అందులో గౌతమీపుత్రుడు ఒకరు. పరబ్రహ్మ శాస్త్రి గారు శాతవాహనుల మీద ఎంతో రీసెర్చ్ చేసి వారు తెలుగువారని నిరూపించారు. వెండినాణెం మీద తన బొమ్మను ముద్రించుకున్న మొట్టమొదటి రాజు శాతకర్ణి. ఇది నా 100వ సినిమా. చిన్నప్పటి నుండి నాన్నగారి సినిమాలు చూసి పెరిగాను. ఆయన గురువు, దైవం. సినిమాల్లోకి రావాలని అప్పుడే అనుకున్నాను. కానీ చదువు ముఖ్యం.. ముందు పూర్తి చేసి తరువాత సినిమా చేయమని చెప్పారు. లేదంటే ఎప్పుడో 150 సినిమాలు దాటేసేవి. ఎన్ని సినిమాలు చేశామని కాదు.. ఎన్ని సినిమాలతో కళామతల్లికి సేవ చేశామనేది ముఖ్యం. ఎంత మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నామనేదే ముఖ్యం. నా అభిమానులు కష్టాల్లో కూడా తోడు ఉంటూనే ఉన్నారు. ఈరోజు నేను నటుడిగా, ఎమ్మెల్యేగా వెలుగొందుతున్నా అంటే అది మా అమ్మ, నాన్న ఆశీస్సులు, నా అభిమానుల చలువే.. ఇటువంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు.. దాన్ని అంత అద్బుతంగా నిర్మించడానికి సాహసించిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. అలానే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్ అధ్బుతం. ఇప్పటివరకు విడుదలైన పాటలకు, టీజర్స్ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయి మాధవ్ అధ్బుతమైన డైలాగ్స్ అందించారు. దానికి తగ్గ సన్నివేశాలు ఉంటాయి. అన్న రుచులు మేళవించి ఈ సినిమాను తీశారు. సమయం లేదు మిత్రమా 12న సినిమా విడుదల. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నా నేను చూడలేదు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమాకు పన్ను రాయితీ మినహాయించారు. ఈ సంధర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఓ తియ్యటి అనుభూతి. ఇప్పటివరకు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. కానీ ఇకపై కాంప్రమైజ్ అవ్వను” అన్నారు.