టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను హుటాహుటిన కారులో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన గుండెపోటుకు గురయ్యారని గుర్తించారు. వెంటనే ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు.
తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు తారకరత్న ప్రస్తుత పరిస్థితి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ… తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. బీపీ కంట్రోల్ లో ఉందని తెలిపారు. అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పారు. అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని అన్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారని అన్నారు.
కుప్పంలోని డాక్టర్లు మంచి చికిత్స చేశారని… ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకుగాని, మరెక్కడికైనా తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని… తాము బెంగళూరుకు తరలిస్తున్నామని బాలయ్య చెప్పారు. ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ, వాటిలో సరైన వైద్య పరికరాలు ఉండవని… అందువల్ల రోడ్డు మార్గంలో అంబులెన్సులో తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఆయన తాత ఎన్టీఆర్ గారు, నానమ్మగారి ఆశీర్వాదాలు, భార్య మాంగల్య బలం, అభిమానుల ప్రార్థనల వల్ల ప్రాణాపాయం లేదని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబుగారు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.
గత కొన్ని రోజులుగా తారకరత్న విశ్రాంతి లేకుండా ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పర్యటనకు సంబంధించి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఇప్పుడు కుప్పంలో పాదయాత్రకు సంబంధించి కూడా ఆయన పర్యవేక్షణ చేశారు. కుప్పంకు ముందే చేరుకుని పనులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఎంతో అలసిపోయారు. ఈ ఉదయం నుంచి కూడా ఉత్సాహంగానే ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.