నందమూరి బాలకృష్ణ హీరోగా.. తమిళనాట స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కించన చిత్రం ‘రూలర్’. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల మధ్య శుక్రవారం ‘రూలర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? బాలయ్య న్యూ లుక్స్‌లో ఏ మేరకు ఆకట్టుకున్నారు? అనేది రివ్యూలో చూద్దాం.
కథ: ఈ చిత్రం కథ ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ప్రారంభమై వయా రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగి మళ్లీ ఉత్తర ప్రదేశ్‌లోనే ముగుస్తుంది. సరోజిని నాయుడు(జయసుధ)కు చెందిన పలు కంపెనీల బాధ్యతలను రెండేళ్లు విదేశాల్లో ఐటీ రంగంపై ప్రత్యేక శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తన వారసుడు అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ)కు అప్పగిస్తారు. అయితే పోటీ ప్రపంచంలో భాగంగా తన ప్రత్యర్థి కంపెనీకి చెందిన హారిక(సోనాల్) అర్జున్‌కు తారసపడుతుంది. ఈ క్రమంలోనే అర్జున్‌తో హారిక ప్రేమలో పడుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అర్జున్ ప్రసాద్ భావిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సరోజిని నాయుడు అడ్డుపడతారు.
ఈ ప్రాజెక్ట్‌కు తన తల్లి ఎందుకు అడ్డుపడుతుందో తెలుసుకొని ఉత్తర ప్రదేశ్ బయల్దేరుతాడు అర్జున్. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. యూపీలో అర్జున్‌ను అందరూ పోలీస్ అఫీసర్ ధర్మ అని పిలుస్తారు. ఇదే క్రమంలో లోకల్ మినిస్టర్ భవానీనాథ్ ఠాగూర్(పరాగ్ త్యాగీ) అర్జున్‌పై దాడి చేయిస్తాడు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ధర్మ, అర్జున్ ఒక్కరేనా? లేక వేరువేరా?. అసలు ఈ కథలోకి సంధ్య(వేదిక), సీతారామయ్య(నాగినీడు), నిరంజనా ప్రసాద్(భూమిక)లు ఎందుకు ఎంట్రీ ఇస్తారు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు: ఈ సినిమాలో రెండు ఢిపరెంట్ షేడ్స్‌లో కనిపించిన బాలకృష్ణ తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రేమనని.. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోనని ఈ సినిమాతో నిరూపించారు. ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లోనూ అదరగొట్టాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించాడంటే అతిశయోక్తి కాదు. ఇక నటనుకు పెద్ద స్కోప్ లేకపోయినప్పటికీ గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లు సోనాల్, వేదికలు ఆకట్టుకున్నారు. వారి అందచందాలతో కుర్రకారును కట్టిపడేశారు. మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన భూమికకు ఈ సినిమాలో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కానీ స్టోరీ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రల్లో నాగినీడు, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, ఝాన్సీ, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ: బాలకృష్ణ సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయె ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నందమూరి ఫ్యాన్స్ ఊహించని సీన్లు, హీరో ఎలివేషన్ షాట్స్, ఫైట్లు హై రేంజ్‌లో ఉన్నాయి. కేవలం బాలకృష్ణ ఇమేజ్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథలో ఏదో మూలన కాస్త కొత్త దనం కనిపించినప్పటికీ.. దానిని అటుతిప్పి ఇటుతిప్పి రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మల్చాడు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, కమర్షియల్ హంగుల మీద దృష్టిపెట్టినంత శ్రద్ద కథ, కథనంపై పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక రెండో అర్థబాగంలో పోలీస్ ఆఫీసర్‌గా వచ్చే బాలయ్య లుక్ సగటు ప్రేక్షకుడికి రుచించలేదు.
బాలకృష్ణ ఎలివేషన్ సీన్లు, ఇంగ్లీష్ డైలాగ్ సోనాల్ అందచందాలు, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయేట్ సాంగ్, శ్రీనివాస్ రెడ్డి బృందం కామెడీతో ఫస్టాఫ్ సక్సెస్ ఫుల్‌గా ముగుస్తుంది. తొలి అర్థభాగం ముగిసే సరికి అసలు కథలోకి సినిమా ఎంటర్ కాదు. అయితే సెకండాఫ్‌లో అసలు స్టోరీలోకి ఎంటర్ అయ్యాక సినిమా ఎటో వెళ్లిపోతుంది.ఇక ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకు చాల ప్లస్‌గా నిలిచింది డ్యాన్స్. బాలయ్య ఇమేజ్‌ను పరిగణలోకి తీసుకుని డ్యాన్స్‌లను ఎక్సలెంట్‌గా కంపోజ్ చేశారు మూవీ కొరియోగ్రాఫర్స్. ఫార్మేషన్స్, బాలయ్యకు ఆప్ట్ అయ్యే స్లైలీష్ స్టెప్పులను కంపోజ్ చేశారు.
సినిమాకు మరోప్లస్ పాయింట్స్ ఫైట్స్. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించిన ఫైట్లు వారిని మైమరిపిస్తాయి. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్స్, హీరోయిన్ ఎంట్రీ సీన్లలో కెమెరా పనితనం కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు తగ్గట్టు పాటలను కంపోజ్ చేశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రఫ్పాడించాడు. అయితే ఎడిటింగ్, స్క్రీన్ ప్లేపై కాస్త దృష్టి పెట్టాల్సి ఉండేది. నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షోతో సినిమాను బాలయ్య నెట్టుకొచ్చాడు. బాలకృష్ట కష్టానికి తగ్గట్టు దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శిస్తే సినిమా వేరే రేంజ్‌లో ఉండేది.
హైలైట్స్ :బాలకృష్ణ
డ్రాబ్యాక్స్ : కథ, కథనం
టైటిల్ : రూలర్
నటీనటులు: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, భూమిక, జయసుధ, షియాజీ షిండే, ప్రకాష్‌రాజ్, పరాగ్.. తదితరులు
దర్శకత్వం : కె.ఎస్ రవికుమార్
నిర్మాత : సి. కల్యాణ్
సంగీతం : చిరంతన్ భట్
చివరిగా : బాలయ్య ‘రూలర్’ అభిమానులకు మాత్రమే..