‘నాట్యం’ మూవీ యూనిట్‌కి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నటి సంధ్యారాజుని సత్కరించారు. ‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా ఈ సినిమాని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకోండ, నటీనటులకు అభినందలు’ అని ట్వీట్ చేశారు.
ఈ మూవీ స్పెషల్ షో చూసిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిత్ర బృందానికి అభినందలు తెలిపారు. ఈ చిత్రం ఓ కళాఖండం అని ప్రశంసించారు. ‘నాట్యం.. ఇది సినిమా కాదు. ఓ కళాఖండం. మరుగునపడుతోన్న కళని తెరపైకి తీసుకొచ్చి, భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు. దర్శకుడు రేవంత్ తాను అనుకున్న కథని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నటులంతా తమతమ పాత్రలో ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశం రక్తికట్టించేలా ఉంది. ఇలాంటి మంచి సినిమాని అందించినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు.
నృత్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నాట్యం’. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదిత్య మేనన్, రోహిత్ బెహల్, కమల్ కామరాజు, భానుప్రియ, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.