నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా సమయంలో ఇకపై తన నుండి అన్నీ కొత్తరకమైన సినిమాలు వస్తాయని బాలయ్య అనౌన్స్ చేశాడు. దానికి తగ్గట్లుగానే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన స్టంపర్ ను విడుదల చేశారు. దీనిలో బాలయ్య డైలాగ్స్, అతని లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మరో ప్రకటన చేసి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. అన్నీ కుదిరితే తన తోటి నటులైన చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలతో తెర పంచుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించాడు. అంతే కాకుండా.. తన 105వ సినిమా ఖచ్చితంగా మల్టీస్టారర్ సినిమా అవుతుందని ఆయన చెబుతున్నారు.
ప్రస్తుతం బాలయ్య 101వ సినిమాగా పూరీ దర్శకత్వంలో పైసా వసూల్ చేస్తున్నాడు. దీని తరువాత 102వ సినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇదే ఊపులో 103,104 సినిమాలు చేసేసి 105వ సినిమాగా మల్టీస్టారర్ సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే 103, 104 సినిమాల విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ అందులో ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి బాలయ్య కోసం మల్టీస్టారర్ కథను ఎవరు సిద్ధం చేస్తారో.. చూడాలి!