టాలీవుడ్ నటడుడు నందమూరి బాలకృష్ణ తన 60వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరయిన క్రమంలో బాలయ్య కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకెష్, నారా బ్రహ్మణి, శ్రీభరత్, తేజస్విని, మోక్షజ్ఞ పాల్గొన్నారు.
బాలయ్య దంపతులకు, చంద్రబాబు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ కూతుర్లు, అళ్లుడులు NBK 1960 అని ఉన్న టీషర్టులను ధరించారు. అంతేకాక బసవతారకం ఆసుపత్రిలోచిన్న పిల్లలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ఆసుపత్రి సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. వారు గొప్ప సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని చెప్పారు. త్వరలోనే కరోనా అంతమొందాలని బాలకృష్ణ ఆశించారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే, వారు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఈ రోజు సాయంత్రం 4.30 నిమిషాలకు ఫేస్‌బుక్ లైవ్‌లోకి తన అభిమానులతో ముచ్చటించబోతున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన ఘనంగా అందరితో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకోలేకపోతోన్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం అభిమానులు తన కోసం వస్తారని, ఈ సారి మాత్రం తానే వస్తున్నానని బాలకృష్ణ చెప్పారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానాలు ఇస్తాను అని తెలిపారు.
‘సుదూరతీరాలనుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎంతో అభిమానంతో నాకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపాలని ప్రతి ఏడాది నన్ను కలవడం మీకు ఆనవాయితీ. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా మిమ్మల్ని భౌతికంగా కలవలేకున్నా మిమ్మల్ని ఆనందపరచడానికి ఫేస్‌బుక్‌లో మీతో సంభాషించాలనుకుంటున్నాను’ అని బాలయ్య తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.