టాలీవుడ్ నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు, నందమూరి బాలకృష్ణ రేపు (జూన్ 10) 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖను రాశారు. తన పుట్టినరోజుని తమ ఇంటి పండుగలా జరుపుకుంటూ, కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ లేఖ ప్రారంభించారు.
అయితే, ఈసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అభిమానులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోతున్నానని, అభిమానుల ఆరోగ్యం గురించి ఆలోచించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, భౌతికదూరం పాటించడం అందరి కర్తవ్యం అని, అందుకే పుట్టినరోజు నాడు అందరినీ కలవాలన్న ఆకాంక్షకు అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాలయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ రోజు బాలయ్య తాను స్వయంగా పాడిన శివశంకరీ పాటను విడుదల చేశారు. మరోకొద్ది సేపటిలో బొయపాటి, బాలయ్య మూవీకి సంబంధించి అప్డేట్ కూడా రానుంది.