నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న వందవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సంధర్భంగా బాలకృష్ణతో కాసిన్ని ముచ్చట్లు..
మొదటి యుద్ధం నుండి..
శాతకర్ణి జీవితంలో జరిగే మొదటి యుద్ధం నుండి గ్రీకు మహారాజును ఓడించి గెలిచే వరకు కథను చూపించాం.
నాన్నే వెనుకుండి నడిపించారు..
నేను ప్రతిది నాన్న గారి నుండి స్పూర్తి పొందుతాను. ఆయన రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో ఒదిగిపోతారు. ఆయనొక ఎన్సైక్లోపీడియా. నిజానికి ఈ పాత్రలో నాన్నగారు నటించాలనుకున్నారు. కానీ రాజకీయ ఒత్తిడుల కారణంగా కుదరలేదు. ఆ
అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ అంతా సజావుగా సాగింది. ప్రతిదీ మాకు అనుకూలంగా జరిగింది. నాన్న వెనకుండి నడిపించారనే భావన కలుగుతోంది.
క్రిష్ గొప్ప దర్శకుడు..
క్రిష్ డైరెక్ట్ చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. ఒకదానితో మరొకటి సంబంధం ఉండదు. హాలీవుడ్ లో కొందరు డైరెక్టర్స్ మాత్రమే అలా సినిమాలు చేస్తారు. వారి కోవలోకి క్రిష్ కూడా వస్తాడు. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాడు. క్రిష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
నా ఆవేశం ఏంటో వాళ్ళకు తెలుసు..
లెజెండ్ సినిమాలో ఒక సీన్ లో గుర్రపు స్వారీ చేశాను. మళ్ళీ ఈ సినిమాలో చేశాను. దానికోసం ఎటువంటి స్పెషల్ ట్రైనింగ్ తీసుకోలేదు. ఫైట్స్ కంపోజ్ చేసిన రామ్, లక్ష్మణ్ లకు నా ఆవేశం ఏంటో బాగా తెలుసు.
ఆయన సింప్లిసిటీకు జోహారులు..
బెంగుళూరులో శివరాజ్ కుమార్ వారి ఫ్యామిలీ అంటే ఎంతో క్రేజ్ ఉంది. వారి అభిమాన హీరో ఇతర భాషల్లో నటిస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు. అంతగా అభిమానిస్తారు వాళ్ళను. కానీ మేము అడిగిన వెంటనే శివరాజ్ ఒప్పుకున్నాడు. శాతకర్ణి జీవిత చరిత్రను తెలిపే నాటకంలో నటించే వాడిగా కనిపిస్తారు. తన సింప్లిసిటీకి నా జోహారులు.
ఇండస్ట్రీ హెల్తీగా ఉండాలి..
కాంపిటీషన్ ను స్పోర్టివ్ గా తీసుకోవాలి. సోలోగా వచ్చి హిట్ కొట్టడం కంటే కాంపిటీషన్ లో హిట్ అందుకోవడం ఆనందాన్నిస్తుంది. రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చక్కగా ఆడాలి అప్పుడే ఇండస్ట్రీ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.
బాలకృష్ణ శకం మొదలవుతుంది…
ఈ సినిమా నేను నటించిన సినిమాల రికార్డ్స్ అన్నీ ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. ఈ సినిమాతో బాలకృష్ణ శకం మొదలవుతుంది.
అమితాబ్ లేకుంటే సినిమా లేదు..
కృష్ణవంశీ నేను వెళ్ళి అమితాబ్ గారికి కథ వినిపించాం. అమితాబ్ గారు లేకపోతే సినిమా లేదు.. ఆయన
రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం.