నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తానని బాలకృష్ణ ప్రకటించగానే రాజకీయవర్గాలు సహా ఇటు కామన్ జనాల్లోనూ ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా కథ ప్రిపరేషన్ సహా ప్రతిదీ తానే దగ్గరుండి పూర్తి చేస్తానని, నిర్మాతగా కొనసాగుతానని బాలయ్య ప్రకటించారు. దీంతో ఇక ఈ బయోపిక్ ప్రకంపనాలు సృష్టించడం ఖాయమని నమ్మారంతా. పైపెచ్చు.. బాలయ్య ఇలా అన్నారో లేదో అలా రామ్ గోపాల్ వర్మ లైన్‌లోకొచ్చేశారు. ఎన్టీఆర్ బయోపిక్‌కి నేనే డైరెక్టర్‌ని అంటూ తనకు తానుగా ప్రకటించుకున్నారు. అన్నగారిపై ఓ పాటను విజువల్ కట్‌లో ప్రిపేర్ చేసి మరీ లైవ్‌లోకి వదిలారు. దాంతో ఇక వర్మ దర్శకుడిగా ఫిక్సయిపోయినట్టేనని అంతా నమ్మారు.
కట్ చేస్తే అక్కడ అంత సీన్ లేదని పలువురు పలు సందర్భాల్లో వర్మ గాలి తీసేశారు. ఎన్టీఆర్ బయోపిక్ గురించి మావయ్య (బాలయ్య)తో మాట్లాడానని, ఈ చిత్రానికి ఇంకా దర్శకుడిని ఫిక్స్ చేయలేదని నారా లోకేష్ అప్పట్లోనే వర్మ స్టేట్‌మెంట్‌ని అధికారికంగా ఖండించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో నటసింహా బాలకృష్ణ సైతం వర్మ దర్శకుడు కాదని అన్నారు. తాజాగా మరోసారి బాలకృష్ణ ఈ బయోపిక్ గురించి మీడియా సమక్షంలో మాట్లాడారు. ఈ చిత్రానికి వర్మ దర్శకుడు కాదు. ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలిపారు. వివాదాస్పద బయోపిక్‌కి ఆది-అంతం తనకు మాత్రమే తెలుసని, ఎక్కడ మొదలెట్టాలి? ఎక్కడ ముగించాలో ప్లాన్ చేశానని వివరించారు. దీంతో వర్మ ఈ చిత్రానికి దర్శకుడు కానేకాదని ఫిక్సవ్వాల్సి వస్తోంది. చూద్దాం.. దీనికి వర్మ స్పందన ఎలా ఉంటుందో?