టాలీవుడ్ నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు, నందమూరి బాలకృష్ణ రేపు (జూన్ 10) 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. 1960లో జన్మించిన బాలయ్య పద్నాలుగేళ్ళ వయసులోనే తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించి మెప్పించారు. నటన పరంగాను, డైలాగ్‌లు చెప్పడంలోనూ, ఆహార్యంలోనూ అచ్చం తండ్రిని పుణికి పుచ్చుకున్నాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించినా… తర్వాత తండ్రితో కలిసి పలు చిత్రాల్లో నటించాడు. హీరో కాకముందు బాలకృష్ణ.. తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలలో తండ్రితో కలిసి నటించాడు. ఆ తరువాత వరుస సినిమాలతో టాప్‌హీరోగా దూసుకెళ్లాడు.
మంగమ్మగారి మనవడు, కథానాయకుడు, భార్యా భర్తల బంధం, భలే తమ్ముడు, ముద్దుల కృష్ణయ్య, సీతారామకల్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు, భానుమతి గారి మొగుడు, రాముడు భీముడు, రక్తాభిషేకం, భలేదొంగ, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆదిత్య 369, అశ్వమేథం, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, వంశానికొక్కడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహ, లెజెండ్, లయన్, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాల్లో, ఎన్నోరకాల, వైవిద్యమైన పాత్రలు పోషించాడు. కాగా తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్‌ను రెండు భాగాలుగా.. (కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు) తెరకెక్కించారు. బాలయ్య ఇప్పటివరకు 105 సినిమాలు పూర్తిచేశారు. తాజాగా బోయపాటి డైరెక్షన్‌లో 106వ సినిమా చేయబోతున్నాడు. అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ప్రకటించనున్నారు. దానితో పాటు తాను స్వయంగా పాడిన ఓ పాటను రీలీజ్ చేయనున్నారు.