బాలకృష్ణ, నాగబాబు మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూస్తుంటే ఇప్పట్లో తెగేటట్లు కనిపించడం లేదు. అసలు ఈ వివాదం ఎప్పుడు ఎక్కడ మొదలైంది. ఈ గొడవలో అసలు తప్పెవరిది అంటే.. పవన్ ఎవరో తెలియదని ముందుగా బాలకృష్ణ చేసిన కామెంట్‌కు.. బాలయ్య ఎవరో తెలియదంటూ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం థౌజండ్ వాలాలాగా టపటపా పేలుతోంది. ఒకరిపై ఒకరు కామెంట్లు, సెటైర్లు, ప్రాక్టికల్ జోక్‌లు వినిపిస్తున్నాయి. వీటి మధ్య ఇరువర్గాలకు చెందిన అభిమానుల మధ్య ప్రత్యక్ష ఫైట్‌లు జరిగే వాతావరణం దాటింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రసకందాయంలో పడింది. ఓ పక్క జగన్, మరోపక్క పవన్.. వీళ్లద్దరితో పోటీ పడాల్సిన పరిస్థితి టీడీపీది. తెలిసీ తెలియని ఓ కన్ఫ్యూజన్ డ్రామా నడుస్తోంది. ఎవరు గెలుస్తారో చెప్పలేని దుస్థితి. గతంలో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కల్యాణ్.. తర్వాత సొంత కుంపటి పెట్టి టీడీపీ, వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అంతటి వారే పవన్‌తో కలిసి వెళ్లే అవకాశముందని లీకులు ఇస్తున్నారు. ఇందుకు భిన్నంగా బాలకృష్ణ నుంచి రివర్స్ గేర్ పడుతోంది.
ఒకచోట పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య శంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయని, కొందరు అలగా జనాన్ని వెంటేసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికి పవన్‌కు బదులు సోదరుడు నాగబాబు నుంచి రియాక్షన్ వచ్చింది. బాలయ్య అంటే ఎవరో తనకు తెలియదనడంతో ఈ గొడవ కొత్త మలుపు తీసుకుంది. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య డైలాగ్స్ వార్ మొదలైంది. బాలకృష్ణ అంటే నాగబాబుకు తెలియదా అంటూ ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమాన వర్గాల్లో తీవ్ర చర్చకు తెరతీసింది.
వివాదాలకు దూరంగా ఉండే నాగబాబు.. గతంలో బాలకృష్ణ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా స్పందించలేదు. కానీ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయగానే కౌంటర్ అటాక్ చేయడం మొదలెట్టారు. పవన్ కల్యాణ్‌గురించి అవమానకరంగా మాట్లాడినట్లు నాగబాబు వాదన. గత ఎన్నికల్లో జగన్ గెలవాల్సింది, దీన్ని అడ్డుకుని సీనియారిటీకి గౌరవమిచ్చి చంద్రబాబుకి అధికారం దక్కేలా తన తమ్ముడు పవన్ కల్యాణ్ కృషి చేశాడని, ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా సహాయం చేశాడని నాగబాబు గుర్తు చేశారు. అందుకోసమే తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీకూడా చేయలేదని అన్నారు. అలాంటి వ్యక్తి పవన్ కల్యాణ్‌ను ఎవరో తెలియదంటూ వ్యాఖ్యలు చేయడం నన్ను బాధించిందని నాగబాబు అన్నారు. అభిమానం చూపించకపోయినా పర్వాలేదు కానీ, ఇలా తక్కువ చేసి మాట్లాడటం ఏమిటన్నది నాగబాబు ప్రశ్న. శంకర జాతి, అలగాజనం అంటూ కులాలను కించపరుస్తూ తిట్టడం జీర్ణించుకోలేకపోతున్నామని నాగబాబు అంటున్నారు. మీరెంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు ఎవ్వరూ చెప్పడం లేదా అని నాగబాబు నిలదీస్తున్నారు.
జగన్ పార్టీని విమర్శించాల్సి వస్తే ప్రత్యక్ష విమర్శలు చేస్తారు. జనసేన విషయంలో పరోక్షంగా మాట్లాడుకుంటారు. కించపరుస్తూ మాట్లాడటమేంటి అని మండిపడ్డారు. ఎవరైనా సహాయం చేసిన వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అవమానకరంగా మాట్లాడే ప్రయత్నం చేయరు. కానీ బాలకృష్ణ తీరు తమను తీవ్రంగా వేధించిందని నాగబాబు అంటున్నారు. దీనిపై బాలకృష్ణ స్పందన చూశాక దీనికి ఓ ముగింపు పలకనున్నట్లు నాగబాబు వెల్లడించారు.
బాలకృష్ణ ఓ కమెడియన్ అనే అర్థం వచ్చేలా నాగబాబు చేసిన కామెంట్ సంచలనం సృష్టించింది. దీంతో నాగబాబు తనయుడి అంతరిక్షం సినిమాను అడ్డుకుంటామని బాలయ్య అభిమానులు అనే వరకు వెళ్లింది. తాను కాంట్రవర్సీలకు దూరమంటూనే అలాంటి వ్యాఖ్యలు చేశారు నాగబాబు. పవన్ ఎవరో తెలియదనడంతో దానికి కౌంటర్ ఇచ్చాం. దానికే ఫీలయిపోతే ఎలా.. అంటూ.. సరే ఇచ్చిందేదో ఇచ్చారు పదే పదే కౌంటర్‌లు ఎందుకు అంటూ నాగబాబు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యక్తి ఐదారేళ్లుగా తన కుటుంబంపైనా, అన్నదమ్ములపైనా కామెంట్స్ చేశారని దీనికి తాను సరదాగా రియాక్ట్ అయ్యానని, సీరియస్ కాలేదని నిజానికి ఆ వ్యక్తిని టార్గెట్ చేయలేదని నాగబాబు అన్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ వివాదం ముదిరి పాకాన పడేలా ఉంది. నందమూరి ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీగా రైజ్ అయ్యేలా కనిపిస్తోంది. బాలకృష్ణ, నాగబాబు మధ్య డైలాగ్ వార్ ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజేస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, వ్యక్తిగతంగా ఎంతో స్నేహంగా ఉంటారు. కానీ ఫ్యాన్స్ మధ్యే దాదాపు యుద్ధాలే జరుగుతుంటాయి. పైకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఈ రెండు వర్గాలు లోలోన మాత్రం మంచి సంబంధాలే జరుపుతుంటాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి రాజమౌళి సినిమాలో చేస్తున్న సంగతీ తెలిసిందే. కానీ బయటి వాతావరణం అంత సవ్యంగా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ రణరంగాన తొడగొడుతుంటే.. మరోవైపు బాలకృష్ణ పవన్ కల్యాణ్ అంటే తెలియదంటూ హాట్ హాట్ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో అన్నీ అనుకున్నట్టు జరిగితే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి 2019 ఎన్నికల్లో పోటీకి వెళ్లే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ మధ్య గొడవ నడుస్తుంటే దీనికి నాగబాబు ఆజ్యం పోస్తుంటే అభిమాన వర్గాల మధ్య నరాల తెగే ఉత్కంఠ లేపుతోంది. బాలకృష్ణను నాగబాబు కావాలనే రెచ్చగొడుతున్నారని, మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబుపై గుర్రుగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.