కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా కన్నుమూశారు.. ఆయన వయస్సు 59 ఏళ్లు.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలసాయి గుండెపోటుతో మృతిచెందారు.. బాల సాయిబాబా… హైదరాబాద్ దోమలగూడలోని ఆశ్రమంలో నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో సిబ్బంది ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన స్వస్థలం కర్నూలు… 1960 జనవరి 14వ తేదీన కర్నూలులో జన్మించారు బాలసాయిబాబా.
ఆయనకు 18 ఏళ్ల వయస్సులోనే కర్నూలులో తొలి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాల్లో కూడా ఆయన ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ప్రతీ ఏడాది ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేవారు… ఆయన జన్మదినవేడుకలకు స్థానిక నేతలతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. ఇక శివరాత్రి రోజు ఆయన నోటి నుంచి శివలింగాన్ని తీస్తుండేవారు. ఆయన పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. భూ వివాదాలు, చెక్‌బౌన్స్ కేసులు ఉండగా… ఆయన ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తులపై కూడా వివాదాలు నడుస్తున్న సమయంలో ఆయన కన్నుమూశారు. కర్నూలులోని బాలసాయి ఆశ్రమంలో ఆయనను మహాసమాధి చేయనున్నట్టు భక్తులు తెలిపారు.