సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఊరట లభించింది. బాధితులతో బండ్ల గణేష్ తరఫు న్యాయవాది చేసినరాజీ ప్రయత్నాలు ఫలించాయి. బాకీ సొమ్ములో ప్రస్తుతం బండ్ల గణేష్ రూ.4లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెల 14న చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నారు. ఈనేపథ్యంలో గణేష్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కడప మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. బండ్ల గణేష్‌పై కడపలో, ప్రొద్దుటూరులో చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి.
నిన్న సాయంత్రం బండ్ల గణేష్ సినీఫక్కీలో అరెస్టయ్యారు. సినీ ఫైనాన్షియర్ పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నోటీసులు స్వీకరించేందుకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదే సమయంలో చెక్‌బౌన్స్ కేసులో కడప కోర్టులో ఆయనపై ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి గురువారం ఉదయం కడప జిల్లా కోర్టులో హాజరుపర్చారు.