బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్హూ నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. దేశం కోసం పనిచేసే పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు కష్టపడేవారంటే ఎంతో ఇష్టమనీ.. అందుకే దేశం కోసం కష్టపడుతున్న మోడీ నేతృత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరినట్టు స్పష్టంచేశారు. క్రీడాభివృద్ధికి మోడీ సర్కార్ ఎంతో చేసిందన్న సైనా.. కష్టపడి దేశానికి సేవచేయడానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు.
24 అంతర్జాతీయ టైటెల్స్ గెలుచుకున్న సైనా నెహ్వాల్ 2009లో వరల్డ్ నంబర్ 2, 2015లో వరల్డ్ నంబర్ 1 ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. హరియాణాలో జన్మించిన సైనా.. హైదరాబాద్‌లోని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకొని విజయవంతమైన క్రీడాకారిణిగా ఎదిగారు. 2015లో ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంకింగ్ మహిళా షట్లర్‌గా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్న సైనా 2018లో తోటి క్రీడాకారుడైన పారుపల్లి కశ్యప్‌ను వివాహం చేసుకున్నారు. గతేడాది ప్రముఖ క్రీడాకారులు గౌతం గంభీర్, బబితా ఫొగాట్ తదితరులు కమల దళంలో చేరిన విషయం తెలిసిందే.