కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ విమర్శించారు. సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ చీడను వదిలించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని బాబూమోహన్ అన్నారు. కేసీఆర్ పతనం ఖాయమని అభిప్రాయపడ్డారు. బుధవారం తెలంగాణలోని సిద్ధిపేట జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని బాబుమోహన్ ప్రారంభించారు.
‘కేసీఆర్ దళిత వ్యతిరేకి. దళితులను అవమాన పరుస్తున్నారని అన్నారు. దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ నలుగురు దళితులను మోసం చేశాడని ఆరోపించారు. దళిత వ్యక్తికి రాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ఘనత బీజేపీదే’ అని బాబూమోహన్ అన్నారు. ఆంథోల్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బాబూమోహన్ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు సూది, దారం, చక్కెర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని అన్నారు. మహారాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని అన్నారు. మద్యం, నగదు పంపిణీకి బీజేపీ దూరమని చెప్పారు.