ayodhya ram mandiram: మరో రెండు రోజుల్లో (జనవరి22) అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ క్రమంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. భక్తీగీతాలు, భజన పాటలు, శ్రీరామ కీర్తనలతో అయోధ్య రామాలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇక సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలను కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సినీ సెలబ్రిటీలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్యలో జరిగే వేడుకలో పాల్గొననున్నారు. ముంబై నుండి ఆయన ఒక ప్రైవేట్ విమానంలో అయోధ్యకు వెళ్లనున్నారు.
ఇక బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, మాధురి దీక్షిత్, హేమమాలిని, అలియా భట్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్ తదితరులు ఆహ్వానం అందుకున్నారు. ఇంకా వీరే కాకుండా శంకర్ మహదేవన్, ఇళయరాజా, సరోద్ వాద్యకారుడు అంజాద్ అలీ, సంజయ్ లీలా బన్సాలి, చంద్రశేఖర్ ద్వివేది తదితరులు ఉన్నారు.
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి, మోహన్ బాబు అలాగే కోలీవుడ్ నుంచి రజినీకాంత్, ధనుష్, మలయాళం నుంచి మోహన్ లాల్, సురేష్ గోపి, కన్నడ నుంచి రిషబ్ శెట్టి, శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్, దర్షన్ తదితరులు అయోధ్య వేడుకకు ఆహ్వానం అందుకున్నారు. అయితే వీరిలో ఎంత మంది ఈ వేడుకకు హాజరవుతారనే దానిపై స్పష్టత లేదు. రామ మందిర నిర్మాణంలో పలువురు సినీ సెలబ్రిటీలు తమవంతుగా విరాళాలు ఇచ్చి రామచంద్రుడు పై తమ భక్తిని కూడా చాటుకున్నారు.
పవన్ కళ్యాణ్ రామమందిరం నిర్మాణానికి 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు. తాను మాత్రమే కాకుండా తనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలతో కూడా పవన్ కళ్యాణ్ విరాళాలు అందజేశారని మొత్తంగా పవన్ కళ్యాణ్ తరపున అయోధ్య రామ మందిరానికి సుమారు 80 లక్షల రూపాయల వరకు విరాళాలు వెళ్లాయని సమాచారం.