జీ20 సదస్సు నిమిత్తం ప్రపంచ దేశాధినేతలు ఒకే వేదికపైకి వచ్చారు. పరస్పర సహకారం అందించుకునేందుకు వైషమ్యాలను పక్కనబెట్టి స్నేహహస్తాన్ని చాటుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ సదస్సకు హాజరై పలు దేశాధినేతలతో కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను మారిసన్ ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతేకాదండోయ్.. ‘కిత్నా అచ్చా హే మోడీ(మోడీ జీ ఎంత బాగున్నారో)’ అంటూ మన ప్రధానిపై ప్రశంసలు కురిపించారు ఆసీస్ ప్రధాని.
ఈ ఫొటోను మారిసన్ శనివారం ఉదయం ట్వీట్ చేయగా.. కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఫొటోను ఇప్పటికే 22వేల మందికి పైగా లైక్ చేయగా.. 5వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. ఇక సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నిన్న భేటీ అయిన మోడీ.. ఈ రోజు ఉదయం మరోసారి కలిశారు. ఇరాన్ ఆంక్షలు, 5జీ, వాణిజ్యం, రక్షణ సహకారంపై మోడీ, ట్రంప్ చర్చలు జరిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో, సౌదీ రాజుతో కూడా మోడీ భేటీ అయ్యారు.