వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్ కటౌట్ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదని అన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని పరిస్థితి తమదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితుల్లో తన సోదరుడు ఎందుకిలా చేశాడో అర్థంకావడంలేదని వాపోయారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందినవాడు. అతడు ఏడాదికాలంగా విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
రేపు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామమిచ్చి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి లాంజ్‌లో కూర్చొన్నారు. అక్కడే ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్‌పై కత్తితో దాడి చేశాడు. కోడిపందాల్లో కోళ్లకు కట్టే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జగన్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో జగన్ హైదరాబాద్‌చేరుకొని ఆస్పత్రిలో చేరారు.